నాణానికి మరోవైపు

జాగృతి వారపత్రిక నిర్వహించిన కీర్తిశేషులు వాకాటి పాండురంగారావు స్మారక దీపావళి కథలపోటీలో ప్రథమ బహుమతి నందుకున్న కథ..

నాణానికి మరోవైపు…

జి.ఎస్.లక్ష్మి..

“అటువైపు యింకా యెండ తగ్గలేదు.. ఇక్కడ కూర్చోండి..” నెమ్మదిగా తన వెనకనుంచి వినిపించిన మాటలకి పార్కులో వాకింగ్ చేస్తున్న సునంద అసంకల్పితంగా వెనక్కి తిరిగిచూసింది. సావిత్రమ్మగారు భర్త చేతిని పట్టుకుని నెమ్మదిగా నడిపిస్తూ యివతలి బెంచీవైపు తీసుకొచ్చింది. ఆయన చేతికర్రని బెంచీకి ఆనిస్తూ నెమ్మదిగా “రామా కృష్ణా..” అనుకుంటూ కూర్చున్నాడు. ఆవిడ పార్కు చుట్టూ నడవడానికి వేసిన రాళ్లమీద నెమ్మదిగా అడుగులు వెయ్యడం మొదలుపెట్టింది.

“యెక్కువసేపు నడవకు. మళ్ళీ రాత్రి కాళ్ళు నెప్పులంటావ్..” ఆ పెద్దాయన మాటలు వద్దనుకున్నా సునంద చెవులకి సోకాయి. సునంద రోజూ సాయంత్రం ఆ కాలనీలో పార్కుకి వాకింగ్ కి వస్తుంది. మంచి ఉద్యోగంలో వుంది. భర్తకి యెక్కువగా టూర్లు తిరిగే ఉద్యోగం అవడంతో ఇంటి బాధ్యత, కొడుకు చదువు బాధ్యత సునందే చూసుకుంటుంది. అంతేకాకుండా ఆమెది మెత్తనిమనసు కూడా అవడంతో కాస్త సంఘసేవ కూడా చేస్తుంటుంది. అంటే.. వరదలుగట్రా వచ్చినప్పుడు డబ్బులు, వస్తువులు పోగుచేసి బాధితులకు సహాయం అందించడం, తాగుబోతు భర్తలు, శాడిస్టు భర్తలు భార్యలను బాధ పెడుతుంటే ఆ భార్యాభర్తలకు కౌన్సిలింగ్ చెయ్యడం, వృధ్ధులైన తల్లితండ్రులని చూడని పిల్లలుంటే వారికి తెలియచెప్పడం, అసలు ఎటువంటి ఆశ్రయమూ లేనివారిని వృధ్ధాశ్రమాల్లో చేర్పించడం లాంటివన్నీ మనస్ఫూర్తిగా చేస్తుంది. అందుకే రోజూ నడవలేక నడవలేక పార్కుకు వచ్చే ఈ వృధ్ధదంపతులు సునంద దృష్టిని ఆకర్షించారు. అడుగు తీసి అడుగు వెయ్యడానికి అంత అవస్థపడుతున్నవారు అసలెందుకు వాకింగ్ కి రావడం.. వాళ్ళింట్లో పరిస్థితి యేమిటో.. కొడుకూ కోడళ్ళ తిట్లూ, దెప్పుళ్ళూ కాసేపైనా తప్పించుకుందుకు యింత కష్టపడి వస్తున్నారేమో.. యిదేదో తెలుసుకోవాల్సిందే.. తెలుసుకుని వారికి తన చేతనైన సాయం అందించాల్సిందే అనుకున్న సునంద వారం క్రితమే వాళ్ళ పేర్లూ, వాళ్ళెక్కడుంటారో అన్నీ కనుక్కుంది.

సన్నటి జరీబార్డరున్న నేతచీర, నుదుట గుండ్రని కుంకుమబొట్టు, మెడలో మంగళసూత్రాలూ, నల్లపూసలూ, రెండుచేతులకీ రెండేసిజతల గాజులూ, ఆత్మవిశ్వాసంతో కూడిన చూపులూ వున్న ఆవిడని చూస్తుంటే జరుగుబాటుకు లోటులేని కుటుంబమే అనిపించింది సునందకి. మరి యిలా రోజూ కాళ్ళీడ్చుకుంటూ యిక్కడికి రావడం యెందుకు? కోడలి నోటిదురుసు భరించలేకనే అనే నిశ్చయానికి వచ్చేసింది సునంద. మొదటిసారే పర్సనల్ విషయాలు అడిగితే బాగుండదని అప్పుడు అంతవరకే అడిగింది. ఇవాళ మరి కాస్త ముందుకెళ్ళి ఆ పెద్దావిడని మరిన్ని విషయాలు అడగడానికి నిశ్చయించేసుకుంది.

పార్కులో సునంద మూడురౌండ్లు నడిచొచ్చేలోపల ఆ పెద్దావిడ యెంతో కష్టంతో ఒక్కరౌండ్ మాత్రం తిరగగలిగి, భర్త పక్కన కూలబడింది. ఆయన పార్కులో ఓ పక్కగా కూర్చుని రాజకీయాలు మాట్లాడుకుంటున్న వారి మాటలు శ్రధ్ధగా వింటున్నారు. నెమ్మదిగా ఆవిడ పక్కన కూర్చుంది సునంద. ఓ చేత్తో కాళ్ళు రాసుకుంటూ పలకరింపుగా చిరునవ్వు నవ్విందావిడ. తీరుగా వున్న ఆవిడ ముఖానికి ఆ చిరునవ్వు మరింత అందం తెచ్చింది.

“మీ యిల్లు యెక్కడాంటీ..?” అనడిగింది.

“పక్కవీధిలో ఆర్.కె. అపార్ట్ మెంట్స్ లో వుంటాం. నువ్వెక్కడుంటావమ్మా?” సునంద అడిగింది కదాని ఆవిడ కూడా మర్యాదకి అడిగింది.

“యిటువైపు ఆంటీ. సాయిసుధా అపార్ట్ మెంట్స్ లో వుంటున్నాం..”

“మీరు రోజూ వస్తారా ఆంటీ పార్కుకి..” అంటూ నవ్వుతూ సంభాషణని పొడిగించింది సునంద.

“ఆ.. సాధారణంగా వస్తూనే వుంటావమ్మా.. యేవిటో ఒక్కడుగు వెయ్యాలంటే యెక్కడలేని ఓపికా కూడదీసుకోవాల్సొస్తోంది . ఆయనైతే యింటి దగ్గర్నుంచి యిక్కడిదాకా వేసే నాలుగడుగులకే కూలబడిపోతారాయె. ఈ రోడ్లు కూడా చూడు యెలా వున్నాయో.. మనం యెంత జాగ్రత్తగా నడుస్తున్నా యెవరు మన మీద యే బండి పెట్టేస్తారో అన్నట్టుంటుంది“ అందావిడ ఆయాసపడుతూ.

“మీరూ, అంకులూ అంత కష్టపడి రాకపోతే యింటి దగ్గరే కూర్చుని యే భక్తి టీవీయో చుసుకోవచ్చు కదాంటీ..” అంది సానుభూతి కనబరుస్తూ. ఆ సానుభూతి నచ్చలేదేమో సావిత్రమ్మకి యేమీ మాట్లాడలేదు. సునంద మరికాస్త చొరవ తీసుకుంది.

“మీరిద్దరే వుంటారు కదా ఆంటీ.. సాయంత్రం అయ్యేసరికి తోచదు. కాస్త యిలా అయినా బయటపడితే నలుగురు మనుషులూ కనిపిస్తారు కదా..” వాళ్ళిద్దరూ వుంటున్నారో, పిల్లలతో కలిసి వుంటున్నారో తెలుసుకుందుకు అలా తెలివిగా ప్రశ్నని తిప్పిఅడిగింది.

“లేదమ్మా. మేమూ, మా అబ్బాయీ అందరం కలిసే వుంటున్నాం.” జవాబు చెప్పక తప్పలేదు ఆవిడకి.

అయితే తన ఊహ కరెక్టే. వీళ్ళు ఆ కొడుకూ కోడళ్ళ సాధింపులు తప్పించుకుందుకే యింత కష్టపడి పార్కు కొస్తున్నారు అనుకుంది సునంద.

“అంకుల్ ఈ వూళ్ళోనే పనిచేసారా ఆంటీ..” నెమ్మదిగా మాటలలోకి దింపింది.

ఆవిడ కాస్త చురుగ్గా చూసింది సునంద వైపు.

ఆవిడ గురించి తనకేమైనా తెలియాలంటే ముందు ఆవిడకి తనగురించీ, తను చేసే సంఘసేవ గురించీ పూర్తిగా పరిచయం చేసుకోవాలనిపించింది సునందకి. అందుకే తను యెక్కడెక్కడ యెవరెవరికి సహాయం చేసిందో, యెంతమంది పిల్లల్ని బాలకార్మికులు కాకుండా కాపాడిందో, యెంతమంది ఆశ్రయం లేని వృధ్ధుల్ని వృధ్ధాశ్రమాల్లో చేర్పించిందో అన్నీ కాస్త గొప్పగానే చెప్పింది. మన గురించి మనం చెప్పుకుంటున్నప్పుడు కాస్త అతిశయోక్తి జోడించకపోతే యెదుటివారికి బాగా అర్ధం కాదని బాగా తెలిసిన సునంద తను చేసిన గోరంత సంఘసేవనీ కొండంతగా చూపించింది.

అన్నీ ఓపిగ్గా విందావిడ. అది చూసిన సునంద ఇంకాస్త ఉత్సాహపడుతూ.. “మీకేదైనా సహాయం కావాలంటే చెప్పండి ఆంటీ..” అంది .

సావిత్రమ్మ యేమీ అర్ధంకానట్టు చూసింది సునందని. ఆవిడకి అర్ధం అయ్యేలా మళ్ళీ చెప్పింది సునంద. “అటుపక్క నాలుగో యింట్లో పార్వతీశంగారని వుండేవారు కదాంటీ.. ఆయన కొడుకు యిలాగే ఆయన కొచ్చే పెన్షన్ మొత్తం తీసేసుకునేవాడు. తిండి కూడా సరిగ్గా పెట్టేవాడు కాదు. నేనే కలగజేసుకుని, మీడియాకీ వార్త అందించి, ఈ వార్త అన్ని చానల్స్ లోనూ వచ్చేలా చేసి, ఆ కొడుక్కి అందరిచేతా నాలుగు చివాట్లు పెట్టించి, ఆ పెద్దాయన్ని మంచి వృధ్ధాశ్రమంలో చేర్పించాను. యిప్పుడాయన అక్కడ సంతోషంగా వున్నారు. అప్పుడప్పుడు ఫోన్ చేసి నన్ను పలకరిస్తుంటారు కూడానూ..” కఠంలో ఒకింత గర్వం తొంగి చూస్తుండగా చెప్పింది సునంద.

“యిది నీ వుద్యోగవామ్మా..?” నెమ్మదిగా అడిగింది సావిత్రమ్మ.

“అబ్బే.. కాదాంటీ.. నేను ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నాను. నాకు ఒక కొడుకు. నైన్త్ క్లాసు చదువుతున్నాడు. కానీ నా యెదురుకుండా యెవరైనా పిల్లలు కానీ, వృధ్ధులు కానీ బాధపడుతుంటే నేను చూళ్ళేనాంటీ.. అందుకే మీ యిద్దరి బాధా చూడలేక అడుగుతున్నాను. యింకా యింత యెండ వుండగానే నాలుగ్గంటలకల్లా ఠంచనుగా యెవరో తరిమినట్లు పార్కుకి వచ్చేస్తారు. సరిగ్గా ఆరుగంటలు అవగానే వెడతారు. ఈ సిమెంటు బెంచీల మీద అంతసేపు కూర్చోలేక ఓసారి కాళ్ళు మడుచుకునీ, పైకి పెట్టుకునీ అవస్థ పడుతుంటారు. హాయిగా యింట్లో కూర్చుని యే భక్తి టీవీయో చూసుకునే అవకాశం మీకు లేకనే కదా మీరిలా యింత బాధపడుతూ నడవలేక నడవలేక వచ్చేదీ.. కాసేపైనా మీ కొడుకూ కోడళ్ల సూటీపోటీమాటలు తప్పించుకుందుకే కదా మీరింత కష్టపడేదీ..?” అవేశపడింది సునంద.

తెల్లబోయింది సావిత్రమ్మ. “నేనలా చెప్పానామ్మా నీకు?” అనడిగింది నెమ్మదిగా.

“చెప్పక్కర్లేదాంటీ.. యిప్పుడు జరుగుతున్న కథే యిది. యిలా తల్లితండ్రుల్ని ఉసురు పెడుతున్న ఆ పిల్లలకి తెలీదా.. యెప్పటికో అప్పటికి వాళ్ళు కూడా పెద్దవాళ్లవుతరనీ..” అలవాటైన మాటలనే మరింత గట్టిగా అంది సునంద. “చెప్పండాంటీ..నేను ఒక్కసారి మీడియాని పిలిచానంటే మీవాళ్ళు బెంబేలెత్తిపోయి, మీ అడుగులకు మడుగులొత్తుతారు.. మీ విషయం చెప్పండాంటీ..”అంది.

“మా పిల్లలు మమ్మల్ని బాగానే చూసుకుంటారమ్మా.. అలాంటి దేమీ లేదు..”అంది నెమ్మదిగా సావిత్రమ్మ.

“యెందుకాంటీ దాస్తారూ.. మీకు నేనున్నాను కదా చెప్పండి..” పిల్లలను బైట పెట్టడం తల్లితండ్రులకి ఇష్టముండదని తెలిసిన సునంద రెట్టించింది.

“లేదమ్మా.. నిజంగానే.. మా కొడుకూ, కోడలూ మమ్మల్ని బాగానే చూసుకుంటారు. మాకేమీ యిబ్బందిలేదు. నువ్వు మీడియా వాళ్ళని పిలిచినా మేము చెప్పేదదే. అయినా మీడియాలో కూడా యెప్పుడూ పెద్దవాళ్లని చూడని పిల్లల గురించే చెపుతారు తప్పితే తల్లితండ్రులని నెత్తిమీద పెట్టుకు చూసే పిల్లల గురించి కూడా చెపితే బాగుంటుంది కదమ్మా.” తనకు తోచిన సలహా యిచ్చింది సావిత్రమ్మ.

“అది కూడా చూపించాలాండీ..?”

“చూపించాలమ్మా.. ఒక పూజ చెయ్యమని చెప్పడానికి అది చెయ్యకపోతే నువ్వు నరకానికి పోతావు.. అని భయపెట్టేకన్నా, ఆ పూజ చేస్తే నీకు మంచిది అని చెపితే భక్తితో ఆ పూజ చేస్తారు. యే పూజ అయినా భయపెట్టి చేయించేకన్నా భక్తితో చేస్తేనే మంచిది కదా. అలాగే మీడియా కూడా పెద్దవాళ్లని చూడకపోతే మీమీద నేరం మోపుతాం అని చెప్పేబదులు, అందరూ కలిసున్నప్పుడు అందే సంతోషం చూపిస్తే, అందులో వున్న ఆనందం గ్రహించి కలిసుంటారు కదా. యెంతసేపూ ఈ మీడియా చెడే చూపిస్తుందెందుకు? నిజం చెప్పాల్సొస్తే యిప్పటికి కూడా యెంతోమంది పిల్లలు వాళ్ళ పెద్దవాళ్లని బాగానే చూసుకుంటున్నారు. యెక్కడో కొంతమంది చూడకపోతే వాళ్ళనే ఒకటికి పదిసార్లు చూపించి పిల్లలందరూ యిలాంటివాళ్ళే నన్న అభిప్రాయాన్ని జనాల్లోకి యెక్కించేస్తున్నారు మీరు“

సావిత్రమ్మ మాటలకి సునంద ఊరుకోలేకపోయింది.

“బాగా చూసుకుంటే హాయిగా యింట్లోనే వుండొచ్చుకదా.. యిలాగ కాళ్ళు పీక్కుపోతుంటే, ఈ యెండలో పార్కుకి రావడమెందుకు?”

అప్పటిదాకా తననెవరూ యిలా నిలదీయక పోవడంతో సావిత్రమ్మనే నిలదీసింది సునంద. హాయిగా నవ్వేసింది సావిత్రమ్మ.

“అదా నీ ఉద్దేశ్యం? మా ఇంట్లోవాళ్ల సూటీపోటీమాటలు పడలేక ఈ కాస్సేపైనా పార్కులో కూర్చుందామని వచ్చామనుకుంటున్నావా నువ్వూ?” అనడిగింది.

“మరీ?” యింకా యెండ కూడా తగ్గకుండా ఉస్సురనుకుంటూ ఆ పెద్దవాళ్ళిద్దరూ అందుకు కాక మరెందుకు వస్తారన్న ధీమాతో అడిగింది సునంద.

“నువ్వు స్థిమితంగా వింటానంటే చెపుతాను.”

“చెప్పండాంటీ..” ఆవిడ సమస్య యెలాంటిదైనా సరే తీర్చెయ్యాలనే కృతనిశ్చయంతో అదేదో వినడానికి మరికాస్త ముందుకు వంగింది.

“మా అబ్బాయి గవర్నమెంటు ఆఫీసరు. మా కోడలు ఇంట్లోనే వుంటుంది. మాకు నైన్త్ క్లాసు చదువుకునే మనవడూ, సెవెన్త్ క్లాస్ చదువుకునే మనవరాలూ వున్నారు. మావారికి నెలకింతని పెన్షన్ కూడా వస్తుంది. అదెప్పుడూ నా కొడుకు అడగలేదు సరికదా.. మా మందులు కూడా మమ్మల్ని కొనుక్కోనివ్వకుండా వాడే కొంటాడు. ఆ డబ్బు అప్పుడప్పుడు పిల్లలు పుట్టినరోజులనీ, పెళ్ళిరోజులనీ మా ఆశీర్వాదాలు తీసుకుందుకొచ్చినప్పుడు మాకు తోచినంత వాళ్ళ చేతిలో పెడుతుంటాము. మా కొడుకూ కోడలూ మమ్మల్ని ప్రేమగానే చూసుకుంటారు.”

“మరి అంతా బాగుంటే యింత యెండలో కూడా ఉస్సురుస్సురనుకుంటూ, యింత కష్టపడి యింట్లోంచి బైటపడితే చాలన్నట్టు యిక్కడికి యెందుకొస్తున్నారాంటీ?” ఆతృతని ఆపుకోలేకపోయింది సునంద.

ఆవిడ చిన్నగా నవ్వి చెప్పడం మొదలుపెట్టింది.

“చూడమ్మా, స్కూల్ నుంచి మూడుగంటలకి యింటికొచ్చిన పిల్లలిద్దరూ మనవడు ట్యూషన్ కీ, మనవరాలు సంగీతానికీ నాలుగవగానే వెళ్ళిపోతారు. మావాడు నాలుగు దాటిన పావుగంటలోపల యింటికొచ్చేస్తాడు. పొద్దున్ననగా ఆదరాబాదరా ఆఫీసుకి వెళ్ళినవాడు అలిసిపోయి వచ్చి కాస్త టిఫిన్ తిని టీ తాగుతాడు. ఆ కాసేపే మొగుడూపెళ్ళాలిద్దరూ కాస్త మాటామంతీ చెప్పుకునేది. పిల్లల భవిష్యత్తు గురించైనా, చుట్టుపక్కలవారి మంచిచెడుల గురించైనా ఒకరితో ఒకరు ఇంకోళ్ళు వింటున్నారనే భయం లేకుండా మాట్లాడుకునేది రోజులో ఆ కాసేపే. మళ్ళీ ఆరవగానే పిల్లలు వచ్చేస్తే వాళ్ల చదువులూ, తిండీతిప్పలూ, రాత్రిపనులూ వుండనే వుంటాయి. ఆ కాస్త సమయం కూడా వాళ్ళిద్దరూ మనసు విప్పి మాట్లాడుకోకపోతే వారిలో ఒకరికొకరన్నభావం ఎలా నిలబడుతుందీ.

అసలే అది రెండుబెడ్ రూముల ఫ్లాటాయె. మావాడొచ్చే టైమ్ కి మేవిద్దరం ఆ హాల్లోనే కూర్చుని టీవీ చూస్తున్నామనుకో.. పాపం ఆ మొగుడూపెళ్ళాలిద్దరికీ వాళ్లకంటూ ప్రత్యేకంగా మాట్లాడుకుందుకు చోటేదీ. పెద్దవాళ్లం మేముండగా యిద్దరూ రూమ్ లోకి వెళ్ళి కూర్చోలేరు. రాత్రి అందరూ పడుకున్నాక మాట్లాడుకుందామంటే యెదుగుతున్న పిల్లలాయె..వాళ్ల చదువులూ అవీ చూసుకోవాలాయె. ఆ విషయాలన్ని ఆలోచించుకోవాలన్నా.. అసలవన్నీ వదిలెయ్యి భార్యాభర్తలిద్దరూ పిల్లల భవిష్యత్తు గురించి మాట్లాడుకోవాలన్నా, పాపం వాళ్లకి సమయమూ, చోటూ కూడా దొరకదాయె. మొగుడూపెళ్ళాలన్నాక కష్టం సుఖం ఒకరికొకరు చెప్పుకోవాలికదా మరి..రోజుమొత్తం మీద దానికి వాళ్ళకి టైమేదీ.. యేదో సాయంత్రం పిల్లలు ట్యూషన్ల కెళ్ళేక మాట్లాడుకుందామంటే ఉత్సవ విగ్రహాల్లాగ మేమెదురుగా వుంటే యింకేం మాట్లాడుకుంటారూ.. అందుకే.. వాళ్లకిద్దరికీ మాత్రమే రోజులో ఆ కాస్త సమయం యివ్వడానికి మేవిద్దరం యిలా వస్తున్నాం. యిలా వస్తున్నందుకు మాకు కాస్త కష్టమనిపించినా మా పిల్లలకి సంతోషం కలిగిస్తున్నామన్న తృప్తి మాకిద్దరికీ వుంది. ఆ తృప్తి ముందు ఈ కష్టం యెంతటిదమ్మా..”

సావిత్రమ్మ చెపుతున్నదానిని విస్ఫారితనేత్రాలతో వింటున్న సునందకి నోటమాటరాలేదు. ఈ విధంగా తన ఆలోచన యెందుకు సాగలేదు అనుకుంటుంటే ఆవిడే మళ్ళీ అంది. “చూడమ్మా..యెవరికైనా సాయం చెయ్యాలన్న తపన నీలో వుంది. కష్టంలో వున్నవాళ్లకి చెయ్యి అందిస్తున్నావు.. అదీ బాగానేవుంది. కానీ అందరూ కష్టాలే పడుతున్నారనుకోకమ్మా. సుఖంగా వుండడం యెలాగో తెలీనివాళ్లకి ఆ ఉపాయం కూడా చెపుతూండు. కష్టాలన్నీ సగానికి పైగా మనం ఊహించుకునేవే. కాస్త స్థిమితంగా ఆలోచిస్తే మనలో చాలామంది ఆ భావననుంచి బైట పడగలరు. నీకు చేతనైతే యిలాంటి ఉపాయాలు చూపించి, అందర్నీ హాయిగా వున్నారని చూపించు మీడియాలో. అది మరో పదిమందికి మార్గదర్శక మవుతుంది.“

సావిత్రమ్మ చెప్పింది వింటున్న సునంద యేమీ మాట్లాడలేకపోయింది. యింతలో ఆ పెద్దాయన కర్ర పుచ్చుకుని లేస్తూ, “వెడదామా..”అన్నా రావిడతో. సావిత్రమ్మ కూడా నెమ్మదిగా లేచి, శెలవు తీసుకుంటున్నట్టు ఆప్యాయంగా సునంద చేతిమీద చెయ్యివేసి నిమిరి, ఆ పెద్దాయన చెయ్యి పట్టుకుని నడిచి వెడుతుంటే, వెనకనుంచి సునంద అప్రయత్నంగా రెండుచేతులూ జోడించకుండా వుండలేకపోయింది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*